

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో మోదుగ చెట్టు ఒకటి. వసంత రుతువులో ఎర్రటి రంగులో వికసించే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. హోలీ పండుగ సమయంలో రసాయన రంగులకు బదులుగా మోదుగ పూలను నీటిలో ఉడకబెట్టి సహజమైన, సురక్షితమైన రంగును తయారు చేయవచ్చు. ఇది చర్మానికి హానికరం కాకుండా ఉపయోగకరంగా ఉంటుంది. పూర్వకాలంలో యజ్ఞయాగాదులు, పూజా కార్యక్రమాల్లో కూడా మోదుగ పూలు మరియు కొమ్మలను పవిత్రంగా భావించి ఉపయోగించేవారు.
ఆయుర్వేదం ప్రకారం మోదుగ పూలలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పూలను ఎండబెట్టి పొడి చేసి నీటితో కలిపి పేస్ట్‌లా తయారు చేసి చర్మంపై రాస్తే మొటిమలు, గజ్జి, తామర మరియు దద్దుర్లు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. వేసవి కాలంలో శరీరం వేడెక్కినప్పుడు మోదుగ పూలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి చల్లదనం లభిస్తుంది. అలాగే ఆ నీటిని తాగడం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మోదుగ పూల రసం కంటి చూపును మెరుగుపరచడంలో మరియు కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది, అయితే దీనిని నిపుణుల సలహాతో మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటను తగ్గించడంలో, మూత్రపిండాల్లోని రాళ్లు కరగడానికి మరియు మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో మోదుగ పూల కషాయం ఉపయోగపడుతుంది. వీటిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కూడా ఉండటంతో మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో, ముఖ్యంగా నులిపురుగుల సమస్యతో బాధపడే పిల్లలకు మోదుగ పూల కషాయం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
గమనిక : ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది వైద్య సలహాగా పరిగణించరాదు. ఆరోగ్యం లేదా ఆహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.







.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!