

టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ డేట్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ షాట్, అలాగే ‘చికిరీ చికిరీ’ సాంగ్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
మార్చి 27 న పెద్ది సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సరైన సమయం లేకపోవడం, టికెట్ రేట్లపై నిబంధనలు వంటి కారణాలతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం వినిపిస్తోంది. ఇంకా కీలక సన్నివేశాల షూటింగ్, ఐటెం సాంగ్, భారీ స్థాయి పాన్ ఇండియా ప్రమోషన్లు చేయాల్సి ఉండటంతో మే లేదా జూన్‌లో రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు టాక్. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చిలోనే సినిమాను విడుదల చేయాలని దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, పెద్ది వాయిదా పడితే అదే మార్చి చివరి డేట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘ఓజి’ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం, గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకు ప్లస్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది కేవలం చర్చ మాత్రమే. రెండు సినిమాల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!