

పాన్–ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “స్పిరిట్.” ఈ చిత్రం మీద హైప్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అవుతూ, తెలుగు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏమిటి ఆ కథ?
ప్రభాస్–సందీప్ వంగా కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, వంగా టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసిన వంగా, ప్రభాస్‌తో చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రతి రోజు ఏదో ఒక కొత్త వార్త బయటికి వస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారన్న రూమర్స్ సోషల్ మీడియాలో ఒకప్పుడు భారీ హంగామా చేశాయి.
ఇటీవల చిరంజీవి క్యామియోపై సందీప్ వంగా స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అయితే కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ విలన్‌గా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం మౌనం వహించాడు. “అప్డేట్ త్వరలో వస్తుంది” అంటూ చెప్పడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. డాన్ లీ నిజంగా విలన్‌గా వస్తే, “స్పిరిట్” అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక చిత్ర ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నెలాఖరులో పూజా కార్యక్రమం జరగనుంది. భద్రకాళి పిక్చర్స్, టీ–సిరీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండటం మరింత క్రేజ్ పెంచింది. యానిమల్ ఫేమ్ త్రుప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారట.
ఇదిలా ఉంటే… తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్, అలాగే మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు ఈ చిత్ర బృందంలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేయనున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మహదాన్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్‌లో చేరినట్లు తెలుస్తోంది. రిషి మనోజ్ విషయంపై అధికారిక సమాచారం రాకపోయినా, ఈ ఇద్దరు స్టార్ వారసులు “స్పిరిట్” తో టాలీవుడ్ టెక్నికల్ విభాగంలో అడుగు పెట్టనున్నారని ఇండస్ట్రీలో ప్రచారం.
మొత్తం మీద, టీజర్‌తో మొదలైన హైప్ ఇప్పుడు రెండింతలు అయింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సౌండ్ గ్లింప్స్‌కు మాస్ రెస్పాన్స్ రావడం, స్టార్ వారసుల ఎంట్రీ రూమర్స్, డాన్ లీపై సందీప్ వంగా కొనసాగిస్తున్న సైలెన్స్ — ఇవన్నీ కలిసి ఈ సినిమాపై ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో “స్పిరిట్” ప్రభాస్ కెరీర్లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో మరో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!