

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేస్తూ పాఠశాల విద్యా సేవలను వాట్సాప్ వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, హాల్ టికెట్లు, మార్కుల మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, బదిలీ ధ్రువపత్రాలు వంటి సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు.
సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన మీసేవ విభాగం, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఈ వేదికను అభివృద్ధి చేశాయి. త్వరలో విద్యార్థుల హాజరు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతికతను విద్యారంగంలో మరింత విస్తరించి, తల్లిదండ్రులు-ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!