

తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమిట్ సన్నాహక సమావేశం దిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీయూష్ గోయల్.. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అభినందనీయమన్నారు. దృఢ సంకల్పంతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నాయని, రాష్ట్రాలు తమ ఆశయాలు, అభివృద్ధి లక్ష్యాలను ఒక వేదికపై వెల్లడించాలని సూచించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. తాండూరు కందిపప్పు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు పొందిందని, రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియాకు 2.5 మెట్రిక్ టన్నుల కందిపప్పు ఎగుమతి అవుతోందని తెలిపారు. నిజామాబాద్ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, దేశీయ ఉత్పత్తులకు మరింత బ్రాండ్ విలువ కల్పించాలని సూచించారు. ప్రధాని మోదీ తెలంగాణలో పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, పీఎం మిత్ర పథకం కింద కాకతీయ టెక్స్టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధితోనే ముడిపడి ఉందని అన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!