

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను యూపీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించి దేశ ప్రజలందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ చేపడుతున్న సమర్థవంతమైన క్యూ నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణను ఆయన అభినందించారు.
పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులను కూడా యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. సుమారు 1,000 సంవత్సరాల క్రితం జగద్గురు శ్రీ రామానుజాచార్య తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామితో పాటు శ్రీరాముల వారి దివ్యరూపాన్ని కూడా దర్శించుకోవడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యంగారు, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఏపీ మంత్రి నారాయణ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు కూడా హాజరయ్యారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!