

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు డీజీపీలు, ఐజీపీల సమావేశం జరగనుంది. తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో అంతర్‌శాఖల కమిటీ సమావేశం నిర్వహించారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శాఖలవారీగా చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీజీపీ మధుసూదన్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రధర్‌బాబు, ఎస్‌ఐబీ డిప్యూటీ డైరెక్టర్ అంబిక, ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌అండ్‌బీ కార్యదర్శి కె. శశిధర్, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర విభాగాల అధికారులు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. జాతీయ స్థాయి పోలీసు ఉన్నతాధికారుల సదస్సు నేపథ్యంలో భద్రత, వసతి, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు సమీక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!