

తెలంగాణలో గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ స్పందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన నీటిమట్టం ప్రస్తుతం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 93.5 మీటర్ల నీటిమట్టం ఉంటేనే నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుందని, ప్రస్తుతం 89 మీటర్ల నీటిమట్టమే ఉందని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసే ఒప్పందానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అంగీకరించిందని ఆయన ఆరోపించారు.
పదేళ్ల పాలనలో రాష్ట్రానికి నష్టం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గోదావరి జలాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ విమర్శించారు. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను వినియోగించుకుంటున్నామని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఈ నెల 28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హాజరై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!