

హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. చంద్రనాయక్ తండాలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో మాదాపూర్, కూకట్‌పల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌లోని 204వ గదిలో ఉన్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు పాస్‌పోర్టు, వీసా వంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
దిల్లీకి చెందిన నాయక్ అనే వ్యక్తి ఆ మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన నాయక్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. అదుపులోకి తీసుకున్న మహిళలను కోర్టు ప్రక్రియ అనంతరం స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సర్వీస్ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు గదులు అద్దెకు ఇచ్చే ముందు కస్టమర్ల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు హెచ్చరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!