

కాజీపేట రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫాంలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పర్శ మార్గాలు (టాక్టైల్ పాత్‌వేలు) ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ముఖ్యంగా అంధులు, దృష్టిలోపం ఉన్నవారు, వృద్ధులు, తొలిసారి స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు వీటి ద్వారా సులభంగా దారి తెలుసుకోవచ్చు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కాజీపేట జంక్షన్‌లో ఈ మార్గాలను ఏర్పాటు చేశారు. పాదాల స్పర్శతో లేదా చేతికర్ర సాయంతో దిశను గుర్తించేలా ప్రత్యేకమైన టైల్స్‌ను అమర్చారు. వీటి ద్వారా ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై సురక్షితంగా కదలడంతో పాటు అవసరమైన సౌకర్యాలను సులభంగా చేరుకోవచ్చు.
ఈ స్పర్శ మార్గాల్లో మూడు రకాల గీతలు ఉన్నాయి. మొదటిది పసుపు రంగులో ఉండే పొడవైన సమాంతర గైడింగ్ టైల్స్. వీటిపై నడుస్తూ ప్రయాణికులు దిశను గుర్తించవచ్చు. మధ్య మధ్యలో ఉండే చతురస్రాకార టైల్స్‌పై గుండ్రటి చుక్కల వంటి ఎత్తైన గుర్తులు ఉంటాయి. ఇవి తాగునీటి కేంద్రాలు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మెట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆహార దుకాణాల వైపు వెళ్లేందుకు మార్గనిర్దేశం చేస్తాయి. రెండోది ప్లాట్‌ఫాం మొదటి నుంచి చివరి వరకు ఉండే మధ్య గీత. దీనిపై గుండ్రటి చుక్కల వంటి స్పర్శ గుర్తులు ఉంటాయి. రైలు కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఇది నిర్దేశిత మార్గాన్ని సూచిస్తుంది. చివరిది నారింజ రంగులో ఉండే గీత. ఇది ప్లాట్‌ఫాం అంచుకు సమీపంలో ఉంటుంది. చతురస్రాకార ఎత్తుపల్లాల టైల్స్‌తో రూపొందించిన ఈ మార్గం రైలు అంచుకు దగ్గరగా వెళ్లకూడదని ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. ఈ ఏర్పాట్లు స్టేషన్‌లో ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!