

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను తీవ్ర తుపానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకి 200 కిలోమీటర్లు, నెల్లూరుకు 210 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 270 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురవవచ్చని తెలిపారు. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ముందస్తుగా ఆరు ఎన్డీఆర్‌ఎఫ్, ఏడు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!