

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో నటించే అవకాశం రావడాన్ని చాలామంది హీరోయిన్లు ప్రత్యేక గుర్తింపుగా భావిస్తుంటారు. అయితే ఆయన చిత్రాల్లో నటించిన ప్రతి హీరోయిన్‌కు ఒకే స్థాయిలో అవకాశాలు, విజయాలు దక్కలేదనే చర్చ తాజాగా మొదలైంది. ‘ఆదర్శ కుటుంబం’లో నివేదా పేతురాజ్ కనిపించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించిన ఆమెకు, తాజా ప్రాజెక్ట్‌లోనూ పరిమితమైన పాత్రే దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదాకు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. ‘రెడ్’, ‘పాగల్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్‌కు పెద్దగా ఊపు రాలేదు.
మరోవైపు, ‘గుంటూరు కారం’లో తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించిన మీనాక్షి చౌదరికి ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో మంచి గుర్తింపు లభించింది. సమంత ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ వంటి త్రివిక్రమ్ సినిమాల్లో నటించగా, పూజా హెగ్డేకు ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు విజయాలను అందించాయి. ప్రణీత, ఈషా రెబ్బా కూడా ఆయన సినిమాల్లో నటించినప్పటికీ అగ్ర కథానాయికల స్థాయికి చేరుకోలేకపోయారు. ఇక ‘పరువు’ వెబ్‌సిరీస్‌లో నివేదా పేతురాజ్‌కు భిన్నమైన పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. ఈ ఉదాహరణలను పరిశీలిస్తే, త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వచ్చినంత మాత్రాన హీరోయిన్ కెరీర్ మారిపోతుందని చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!