

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కనీస సౌకర్యాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యలను పరిష్కరించకుండా విదేశీ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
గత ఐదేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, అవి దాదాపు రూ.15 వేల కోట్లకు చేరినట్లు బండి సంజయ్ ఆరోపించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ తదితర కోర్సులు అందించే వేలాది ప్రైవేట్ కాలేజీలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేక కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ తెలిపారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందని అన్నారు. ఫీజు బకాయిల కారణంగా కొందరు విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడం, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, పై చదువులు కొనసాగించడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరిస్తామని, ఇకపై నిర్ణీత సమయంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఆ హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” దీక్షకు బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!