

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముంబైలో నిర్వహించిన ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాన్క్లేవ్‌లో భాగంగా ప్రకటించిన ‘పరివర్తన్ అవార్డ్స్ 2026’లో ప్రజావాణి పోర్టల్‌కు ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్సలెన్స్’ పురస్కారం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ వేదికను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసింది. సంప్రదాయ కాగితపు ఫిర్యాదుల విధానానికి బదులుగా పారదర్శకమైన, ఆధునిక డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఈ అవార్డు లభించింది. ప్రజాభవన్ నుంచి జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు, మండల పరిషత్ స్థాయి వరకు వివిధ పరిపాలనా విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసింది.
ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు సంబంధిత శాఖాధిపతులు, క్షేత్రస్థాయి అధికారులకు ఆటోమేటిక్‌గా చేరడంతో పాటు, ప్రత్యేక రసీదు సంఖ్యలు, ఎస్ఎంఎస్ అలర్ట్‌ల ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. పెండింగ్ ఫిర్యాదులను పర్యవేక్షించి, సకాలంలో పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు లక్షకు పైగా ఫిర్యాదులను పరిష్కరించిన ప్రజావాణి వికేంద్రీకృత ప్రజాసేవలందించడంలో ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం, CGG తరఫున గౌరవ్ ఉప్పల్ (IAS), ప్రణాళిక శాఖ కార్యదర్శి; కె. విద్యాసాగర్, ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి; రవి గుప్తా, CGG వైస్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల శాఖ కమిషనర్ బి.జె. సింగ్, ఐలాంచ్ నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు, ఐటీ రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏఐ ఆధారిత ప్రజాసేవలపై చర్చలు జరిగాయి. ప్యానల్ చర్చల్లో పాల్గొన్న రవి గుప్తా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత ప్రజా ప్రయోజన కార్యక్రమాలను వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!