

అమెరికాలోని పలు ప్రముఖ బ్యాంకుల సాంకేతిక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తడంతో కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చేజ్, జేపీ మోర్గాన్, యూఎస్ బ్యాంక్, వెల్స్ ఫార్గోతో పాటు డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్ జెల్లె సేవల్లోనూ అంతరాయాలు నమోదైనట్లు డౌన్‌డిటెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం, బ్యాంకు ఖాతాల్లోకి లాగిన్ కావడం వంటి సేవల్లో సమస్యలు ఎదురైనట్లు వినియోగదారులు తెలిపారు.
ఈ సమస్యపై చేజ్ బ్యాంక్ స్పందిస్తూ.. సాంకేతిక లోపం కారణంగానే సేవల్లో అంతరాయం ఏర్పడిందని, ఇందులో సైబర్ దాడి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. లావాదేవీల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నప్పటికీ ఖాతాలు, నిధులకు యాక్సెస్ పూర్తిగా నిలిచిపోలేదని వెల్లడించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరోవైపు, వినియోగదారులు ఎర్రర్ మెసేజ్‌లు వస్తున్నాయని, కొన్ని సేవలు అందుబాటులో లేవని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ సేవలు, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వ్యవస్థల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో కొద్దిసేపు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానం టేకాఫ్‌కు ముందు అవసరమైన వెయిట్ అండ్ బ్యాలెన్స్ డేటా పైలట్లకు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం బరువు, సమతుల్యతకు సంబంధించిన ఈ సమాచారం విమాన ప్రయాణ భద్రతకు కీలకం. కొద్దిసేపటి తర్వాత సమస్యను పరిష్కరించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనలోనూ సైబర్ దాడి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!