

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే నిజమైన నిర్మాతలు ఉపాధ్యాయులేనని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఏఐ వచ్చినా ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేమని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరమన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని, ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, డేటా అనలటిక్స్, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ వంటి రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలని, ఏడో తరగతి విద్యార్థులు సైతం ఏఐలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దాలని అన్నారు.
విద్య కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా ఉండాలని చంద్రబాబు సూచించారు. సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఉపాధ్యాయులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పారు. నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, దేశభక్తి, ప్రకృతిపై ప్రేమ, పెద్దల పట్ల గౌరవం, మహిళలను గౌరవించడం వంటి అంశాలను విద్యలో భాగం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి ప్రతి పాఠశాలను మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ సత్కరించి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!