

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఎవరిపట్లా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలన పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, పంపుసెట్లకు ఉచిత విద్యుత్, ఉద్యోగ నియామకాలు వంటి కార్యక్రమాలను సీఎం వివరించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో రూ.9.85 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.20 కోట్లతో సమీకృత కార్యాలయాల సముదాయం, రూ.45.60 కోట్లతో రహదారి అభివృద్ధి సహా పలు పనులకు శంకుస్థాపన చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!