

తమిళనాడు ప్రభుత్వం అమలు చేయనున్న ‘తాయ్ మామన్ తంగ మోతిరం’ పథకం టెండర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఒక గ్రాము బరువున్న బంగారు ఉంగరం అందించే ఈ పథకంలో.. బంగారం ధరను మినహాయించి ఒక్కో ఉంగరానికి తయారీ చార్జీగా జోయాలుక్కాస్ సంస్థ కేవలం రూ.0.01, అంటే ఒక్క పైసా కోట్ చేసి ఎల్1గా నిలిచినట్లు తాజా కథనాలు వెల్లడించాయి. తొలి దశలో జూన్ 22 నుంచి సెప్టెంబరు వరకు పుట్టిన శిశువుల కోసం 1,28,499 ఉంగరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ టెండర్‌లో మొత్తం 11 ప్రముఖ నగల సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం. బంగారం ధరతో పాటు ఉంగరం తయారీ, ఇతర అనుబంధ ఖర్చుల కోసం సంస్థలు తమ ధరలను కోట్ చేశాయి. జోయాలుక్కాస్ ఒక్కో ఉంగరానికి ఒక్క పైసా కోట్ చేయగా, ఇతర సంస్థలు వందల నుంచి వేల రూపాయల వరకు ధరలు పేర్కొన్నాయి. తక్కువ ధరను సరిపోల్చేందుకు కల్యాణ్ జువెల్లర్స్ ముందుకు రావడంతో ఆర్డర్‌ను రెండు సంస్థలకు కేటాయించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఒక్క పైసా తయారీ చార్జీతో బంగారు ఉంగరం ఎలా అందించగలరన్న అంశంపై చర్చ మొదలైంది. తయారీ, తరుగు, బీమా, ప్యాకింగ్, బీఐఎస్ హాల్‌మార్కింగ్, రవాణా వంటి ఖర్చులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ కోట్‌పై ఆసక్తి నెలకొంది. మరోవైపు టెండర్ ప్రక్రియపై రాజకీయ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒక్క పైసా కోట్ అనేది బంగారం అసలు ధరకు కాకుండా, దానికి అదనంగా పేర్కొన్న చార్జీలకు సంబంధించినదని స్పష్టమవుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!