

చెన్నై మెట్రో రెండో దశలో ప్రయాణికులకు సేవలందిస్తున్న డ్రైవర్ రహిత రైళ్లను ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో తయారు చేసినట్లు ఆల్స్టోమ్ సంస్థ వెల్లడించింది. ఈ నెల 12న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రెండో దశలోని కారిడార్-4లో రైలు సేవలను ప్రారంభించారు. చెన్నై ప్రజారవాణా వ్యవస్థ ఆధునికీకరణలో ఈ కార్యక్రమం కీలక ముందడుగని ఆల్స్టోమ్ పేర్కొంది. కారిడార్-4లో నడుస్తున్న 36 రైళ్లకు అవసరమైన 108 కోచ్లను శ్రీసిటీలోని తమ తయారీ కేంద్రంలో రూపొందించినట్లు తెలిపింది. అదనంగా మరో 32 డ్రైవర్ రహిత మెట్రో రైళ్ల తయారీ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
చెన్నై మెట్రో రెండో దశలో ప్రయాణికుల సేవలు ప్రారంభం కావడం తమ సంస్థకు గర్వకారణమని ఆల్స్టోమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఒలివియర్ లోయిసన్ తెలిపారు. భారత ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని, ప్రపంచస్థాయి ప్రజారవాణా పరిష్కారాల అభివృద్ధిపై తమ నిబద్ధతను ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ డ్రైవర్ రహిత రైళ్లను రూపొందించినట్లు వివరించారు. ప్రతి రైలులో మూడు కోచ్లు ఉంటాయని, ఒక రైలులో సుమారు 1,000 మంది వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. శ్రీసిటీలో తయారైన రైళ్లు చెన్నై నగరంలో ఆధునిక, సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!