

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లోకి అడుగుపెట్టారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ గురించి వీడియో రూపంలో తొలి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని, తన భర్త రాజీవ్ గాంధీతో పరిచయం, స్నేహం, ప్రేమగా మారిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న పుస్తకం ద్వారా తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోనున్నట్లు తెలిపారు.
కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్లో పరస్పర పరిచయం ఏర్పడిందని సోనియా వెల్లడించారు. ఇటాలియన్ ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో ఆ రెస్టారెంట్‌కు వెళ్లేవారని, అక్కడ ఓ ఉమ్మడి స్నేహితుడి ద్వారా రాజీవ్‌ను కలిశానని చెప్పారు. తొలిసారి చూసినప్పుడే ఆయన తనకు సరైన వ్యక్తి అనిపించారని, రాజీవ్ కూడా తన గురించి అలాగే భావించినట్లు తర్వాత తెలుసుకున్నానని పేర్కొన్నారు. రాజీవ్ అందంగా ఉండటంతో పాటు సౌమ్యమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం తనను ఆకర్షించిందన్నారు. వారి పాత ఫొటోలతో రూపొందించిన వీడియోలో ఈ జ్ఞాపకాలను పంచుకున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!