

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తాజా ఎపిసోడ్‌లో గోట్ టాస్కులు ఉత్కంఠభరితంగా సాగాయి. భావోద్వేగాలు, వాదనలు, అనూహ్య పరిణామాల మధ్య కంటెస్టెంట్లు తమ సత్తా చాటారు. 48వ ఎపిసోడ్‌లో గ్రీన్ లెవల్‌లో తన ఫొటోను చూసుకున్న దేబ్జానీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కష్టాన్ని గుర్తించిన త్రిగుణ్ అభినందించాడు. అనంతరం ఎల్లో లెవల్‌లో ఉన్నవారికి గ్రీన్ లెవల్‌లోకి వెళ్లేందుకు గోట్ ఆఫ్ కామన్ సెన్స్ టాస్క్ నిర్వహించారు. ఇందులో ముకేష్ ఎక్కువ పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. దీంతో అతడికి గ్రీన్ లెవల్‌లో చోటుతో పాటు రెండు వారాల పాటు ఎలిమినేషన్ నుంచి రక్షణ లభించింది. అయితే టాస్క్ సమయంలో ముకేష్, శివ్ మధ్య తోపులాట జరగడం, శివ్ తలకు దెబ్బ తగలడం కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఆ తర్వాత నిర్వహించిన గోట్ ఆఫ్ స్పీడ్ టాస్క్‌లో త్రిగుణ్, శివ్ జోడీ అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. కాలికి గాయం అయినప్పటికీ శివ్ ఆటను కొనసాగించాడు. అయితే గెలిచిన జట్టులో ఒక్కరికే గ్రీన్ లెవల్‌లోకి వెళ్లే అవకాశం ఉందని బిగ్ బాస్ ప్రకటించడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ఒక అవకాశం ఇవ్వాలని త్రిగుణ్ భావోద్వేగంగా శివ్‌ను కోరాడు. గతంలో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఈసారి త్రిగుణ్ తనను ఒప్పించేందుకు నిజాయితీగా ప్రయత్నించాడని శివ్ గుర్తుచేసుకున్నాడు. త్రిగుణ్ కష్టాన్ని గుర్తించి, అతడే గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలవాలని నిర్ణయించుకుని శివ్ వెనక్కి తగ్గాడు. దీంతో త్రిగుణ్ భావోద్వేగానికి గురై శివ్‌ను హత్తుకున్నాడు. ఇద్దరూ కలిసి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నిర్ణయంతో త్రిగుణ్‌కు ఈ వారం, వచ్చే వారం కూడా ఎలిమినేషన్ నుంచి రక్షణ లభించినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. త్రిగుణ్ కోసం శివ్ చేసిన త్యాగం ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!