

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు భరోసా ఇచ్చింది. ఖాతాల్లోని నగదు నిల్వలు, బ్యాంకులో ఉన్న నిధులు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. బ్యాంకుకు చెందిన ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో లీక్ అయినట్లు వచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వివరాలు ప్రభావితమైనట్లు, సుమారు 3.75 లక్షల రికార్డులు బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై అక్టోబర్ 16న డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) నుంచి ఎస్‌బీఐకి హెచ్చరికలు అందాయి.
ఈ నేపథ్యంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ ఖాతాదారులకు సూచించింది. వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ), ఏటీఎం పిన్ లేదా ఇతర పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించింది. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, ఈమెయిళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. డేటా లీక్ ఘటనపై సమగ్రంగా పరిశీలన జరుగుతోందని, అవసరమైన దిద్దుబాటు, నివారణ చర్యలు చేపడుతున్నామని బ్యాంకు వెల్లడించింది. ఖాతాదారులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను కోరుతూ వచ్చే అనుమానాస్పద అభ్యర్థనలకు స్పందించవద్దని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!