

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న ఐదు ఎకరాల భూమిపై తన హక్కులను ప్రకటిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల జరిగిన ప్రభుత్వ వేలంలో ఈ భూమి ఎకరానికి రూ.237 కోట్ల రికార్డు ధర పలకడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్, అనంతరం జరిగిన భూ విక్రయం, అలాగే మే 20న తమ వినతిపత్రాన్ని తిరస్కరించిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్‌బీఐ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది.
ఎస్‌బీఐ వాదన ప్రకారం, ఈ భూమిని 2010లో అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కు ప్రభుత్వం కేటాయించగా, అందుకు రూ.13.33 కోట్లు చెల్లించారు. అనంతరం ఎస్‌బీహెచ్ ఎస్‌బీఐలో విలీనం కావడంతో ఆ హక్కులు తమకు సంక్రమించాయని బ్యాంకు పేర్కొంది. ముంబయి తర్వాత దేశంలో రెండో కార్పొరేట్ కార్యాలయాన్ని అక్కడే నిర్మించాలనే ప్రణాళికతో ఇప్పటికే ప్రహరీ, అభివృద్ధి పనుల కోసం రూ.21.50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోర్టుకు తెలిపింది. తమ వినతిని పరిష్కరించకుండానే ప్రభుత్వం వేలం నిర్వహించిందని ఆరోపిస్తూ, విక్రయాన్ని రద్దు చేయాలని ఎస్‌బీఐ కోరింది. ఈ వ్యవహారంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!