
తెలంగాణవ్యాప్తంగా చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన పటాన్‌చెరులో 12.4, రాజేంద్రనగర్‌లో 13.0, ఉమ్మడి మెదక్ జిల్లాలోని శివ్వంపేటలో 13.3 డిగ్రీలు నమోదయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ)లో 13.4, తిర్యాణిలో 13.6, కెరమెరి, వాంకిడి మండలాల్లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం, రాత్రి వేళల్లో దూర ప్రయాణాలు చేసేవారు తమ ప్రయాణ సమయాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ చలిగాలుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనాల రద్దీ తగ్గుతోంది. ఉదయం 9 గంటల వరకు చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు మాస్కులు, స్వెట్టర్లు ధరించి బయటకు వస్తున్నారు. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతుండటంతో మధ్యాహ్నం వేళల్లోనూ చలిగాలుల ప్రభావం కొనసాగుతోంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ నగర సముదాయ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, చలిగాలుల తీవ్రత మాత్రం అధికంగానే ఉండనుందని అంచనా. వాతావరణ మార్పుల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని, డిసెంబర్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!