

ఆంధ్రప్రదేశ్‌లోని పలు రైళ్లలో వరుస చోరీలు, గొలుసు దోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రైల్వే పోలీసులు ఛేదించారు. మొదట ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా అనుమానించిన పోలీసులు, దర్యాప్తు అనంతరం నిందితులు రాజస్థాన్‌కు చెందినవారని గుర్తించారు. చెన్నై, బెంగళూరు నుంచి నరసాపురం, కాకినాడ వైపు వెళ్లే రైళ్లలో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణిస్తూ, గాఢనిద్రలో ఉన్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను అపహరించడం ఈ ముఠా ప్రధాన పద్ధతిగా తేలింది. అనంతరం అత్యవసర చైన్ లాగి రైలును ఆపి, చీకట్లో పొలాల గుండా పారిపోయేవారని పోలీసులు వెల్లడించారు.
ఇటీవల అప్పికట్ల సమీపంలో జరిగిన చోరీ ప్రయత్నం సందర్భంగా రైల్వే పోలీసులపై దొంగలు రాళ్ల దాడికి పాల్పడగా, వారిని అడ్డుకునేందుకు ఏఆర్ పోలీసులు కాల్పులు జరిపారు. విస్తృత గాలింపు చర్యల్లో సోను అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం, నెల్లూరు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరో ఐదుగురు నిందితుల వివరాలను గుర్తించారు. టవర్ డంప్, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులపై పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, గతంలో జరిగిన చోరీ కేసులను కూడా ఛేదించే దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!