

భారత్‌లో కొంతకాలంగా నివసిస్తున్న పోలెండ్‌కు చెందిన డొమినికా పటాలస్ కల్రా.. భారతీయుల రోజువారీ జీవనశైలి, అలవాట్లపై చేసిన సరదా పోస్టుతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ‘నేను భారత్‌లో తప్ప ఇంకెక్కడా చేయలేని పనులు’ అనే క్యాప్షన్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పలు విషయాలను పంచుకున్నారు. భారతీయులు పాటించే కొన్ని అలవాట్లు విదేశీయులకు భిన్నంగా అనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు.
భారత్‌లో పరిచయం లేని వారిని కూడా భయ్యా, దీదీ, అంకుల్, ఆంటీ అని ఆప్యాయంగా పిలవడం, దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ కంటే రోడ్డుపై కనిపించే వారిని అడిగి వారి మాట నమ్మడం వంటి విషయాలను ఆమె ప్రస్తావించారు. పొరుగింటి వారు ఇచ్చే ఆహారాన్ని తిరస్కరించలేమని, అలా చేస్తే ఎదుటివారిని అవమానించినట్లు భావించే పరిస్థితి ఉంటుందని సరదాగా చెప్పారు. పరిచయం ఉన్న ఆంటీలు తన వ్యక్తిగత జీవితం, కెరీర్, పెళ్లి, బరువు, భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేసినా వాటిని సాధారణంగానే తీసుకుంటానని తెలిపారు.
ఇతరుల ఇళ్లకు అకస్మాత్తుగా వెళ్లినా ఆత్మీయంగా ఆహ్వానించడం, కొద్దిసేపు మాట్లాడిన తర్వాతే ఆటో డ్రైవర్‌ను నమ్మి ప్రయాణించడం కూడా భారత్‌లో తనకు అలవాటైపోయిన విషయాలుగా డొమినికా పేర్కొన్నారు. రోడ్డు పక్కన శుభ్రతపై పెద్దగా నమ్మకం కలగని స్టాల్స్‌లోనూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఆస్వాదిస్తానని, అదే సమయంలో విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఫుడ్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని సరదాగా చెప్పారు. చిన్న దుకాణంలో గాజు గ్లాస్‌లో టీ తాగడం కూడా తనకు ఫైవ్‌స్టార్ హోటల్ అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.
పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు పెద్దగా పరిచయం లేని వారితోనూ కుటుంబ సభ్యురాలిలా కలిసిపోవడం, ఎవరైనా తన కోసం ఎదురుచూస్తున్నప్పుడు ‘ఇప్పుడే బయల్దేరాను.. ఐదు నిమిషాల్లో వస్తాను’ అని చెప్పి, అప్పటికీ ఇంట్లోనే రెడీ అవుతూ ఉండటం వంటి విషయాలను కూడా ఆమె తన జాబితాలో చేర్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందించారు.
‘చివరి పాయింట్ అక్షరాలా నిజం’, ‘మీరు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు’ అంటూ పలువురు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు భారతీయుల ప్రేమ, ఆతిథ్యాన్ని అందంగా వివరించినందుకు డొమినికాకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె చెప్పిన విషయాలు భారతీయుల రోజువారీ జీవితాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయంటూ నెటిజన్లు ప్రశంసించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!