

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అయితే, దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు సరిపోవడం లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు దాదాపు మూడు నెలల పాటు జరిగే జాతర సమయంలోనూ పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆలయ పాలనను సమన్వయం చేస్తూ, సౌకర్యాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన శాశ్వత కార్యనిర్వహణాధికారి లేకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి శ్రీకాంత్‌రావుకు ఈవో బాధ్యతలు అప్పగించారు. పాలనా వ్యవహారాలను చక్కదిద్ది, ఆదాయాన్ని పెంచడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు ఆశిస్తున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్, వసతి ప్రధాన సమస్యలుగా మారాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ముఖద్వారం సమీపంలో ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. రాత్రిపూట ఆలయ ప్రాంగణంలో విడిది చేయాలనుకునే వారికి సరైన వసతి లేకపోవడంతో ప్రైవేటు గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. వేములవాడ, తిరుపతి తరహాలో ప్రత్యేక సత్రాలు, వసతి గృహాలు నిర్మిస్తే భక్తులకు సౌకర్యంతో పాటు ఆలయానికి ఆదాయం కూడా సమకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, స్వామివారి పేరిట ఉన్న భూముల రిజిస్ట్రేషన్ అంశం కూడా పరిష్కారం కావాల్సి ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం ఆలయానికి 20.25 ఎకరాల భూమి ఉండగా, 2014 డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న 110.20 ఎకరాల ప్రభుత్వ భూములను స్వామివారి పేరిట మార్చాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఆ భూముల సర్వే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదని తెలుస్తోంది. వాటిని ఇతర అవసరాలకు వినియోగించకుండా ఆలయం పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆలయానికి ఏటా సుమారు రూ.22–23 కోట్ల ఆదాయం వస్తోంది. టికెట్ల విక్రయాలు, హుండీ నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు పట్నం, పెద్దపట్నం పూజల సందర్భంగా ఒగ్గు పూజారులు బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటే ఆలయ ఆదాయం పెరుగుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!