

ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, నిర్బంధాలకు పాల్పడటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు వైపు శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వచ్చిన యువతను అడ్డుకోవడం, వారిపై బలప్రయోగం చేయడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. యువత హక్కులను కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును పరిరక్షించే ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఈ శాంతియుత మార్చ్‌లో యువత, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!