

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ కేవలం రెండు నెలల క్రితం ప్రారంభమైన రాజకీయ వ్యంగ్య ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం ఢిల్లీలో "చలో పార్లమెంట్" ర్యాలీ నిర్వహించింది. నీట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా విద్యార్థులు, యువత, మహిళలు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు పాల్గొని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" నినాదాలతో ముందుకు సాగారు.
పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రత, బారికేడ్లు, మెట్రో స్టేషన్ల మూసివేత వంటి చర్యలు చేపట్టినా నిరసనకారులు వివిధ మార్గాల్లో ముందుకు కదిలారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులు గాయపడగా, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో-లీగల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 118 మంది పోలీసు, భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి సోనమ్ వాంగ్‌చుక్ విడుదల, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం వంటి డిమాండ్లు వినిపించారు. డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా, స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!