

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితాలోని కొన్ని కులాల పేర్లను సవరిస్తూ గౌరవప్రదమైన ప్రత్యామ్నాయ పదాలను చేర్చింది. సమాజంలో కొన్ని కులాల పేర్లు అవమానకరంగా, దూషణలుగా వినియోగించబడుతున్నాయనే అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికలు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ మార్పులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి బాల మాయాదేవి విడుదల చేశారు.
ఈ సవరణల ప్రకారం ‘దొమ్మర’ కులం పేరును ‘గడ వంశీయ’గా మార్చగా, ‘పిచ్చిగుంట్ల’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి ‘వంశరాజ్’ పేరును మాత్రమే కొనసాగించనున్నారు. అలాగే ‘బుడబుక్కల’కు ‘శివ క్షత్రియ’ అనే ప్రత్యామ్నాయ పదాన్ని చేర్చారు. ‘రజక, చాకలి’ వర్గానికి ‘ధోబీ’ అనే పదాన్ని జోడించి, ‘వన్నార్’ అనే పదాన్ని తొలగించారు. అభ్యర్థుల అభిరుచికి అనుగుణంగా ఈ పేర్లలో ఏదైనా ఒక పేరుతో ధృవీకరణ పత్రాలు జారీ చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేవిధంగా ‘వీరముష్టి’ ఎంట్రీని ‘వీరభద్రీయ’గా సవరించగా, ‘మేర, మేరు, చిప్పోళ్లు’ పేర్లను ఒకే వర్గంగా గుర్తించారు. ‘తమ్మలి’ వర్గ వివరణలో ఉన్న ‘శూద్రకాస్ట్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించారు. కొత్త పేర్లతో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, భూ పరిపాలన అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!