

తెలంగాణ క్రికెట్ వర్గాల్లో టీజీ20 లీగ్ వివాదం సంచలనంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి లేకుండా ఈ లీగ్ నిర్వహించబడుతోందనే ఆరోపణల మధ్య, దీనికి మద్దతు ఇస్తున్నారనే కారణంతో టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, అలాగే సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని టీసీఏ ప్రధాన కార్యదర్శి గురవా రెడ్డి వెల్లడించారు.
టీజీ20 లీగ్‌కు బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అలాంటి టోర్నీని సెలబ్రిటీల ద్వారా ప్రోత్సహించడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య అని గురవా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీ లీగ్ నిర్వహణకు బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రత్యేక గవర్నింగ్ కౌన్సిల్, సాధారణ సభ ద్వారా ఛైర్మన్ ఎన్నిక వంటి విధానాలు తప్పనిసరి అని తెలిపారు. అయితే టీజీ20 లీగ్ ఈ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. నోటీసులకు స్పందించకపోతే సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!