

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో చిర్‌బాసా ప్రాంతంలో చిక్కుకుపోయిన సుమారు 1,500 మంది యాత్రికులను అధికారులు సురక్షితంగా తరలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి యాత్రికులు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దర్శనాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం.
సోన్‌ప్రయాగ్‌కు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిర్‌బాసా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో మార్గంలో భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండటంతో యాత్రికుల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసింది. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా యాత్రికులను ప్రమాదకర ప్రాంతం దాటించి గౌరీకుండ్‌కు తరలించారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర వరుసగా రెండో రోజూ నిలిచిపోయింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!