

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేరళ సీఎం వి.డి. సతీశన్ ఆరోగ్యం, ప్రజా రవాణా, తీర ప్రాంత రక్షణ, మౌలిక వసతులకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేరళకు అందుతున్న నిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం రూ.1,493 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం నుంచి రూ.151 కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రాల వినియోగాన్ని ఆధారంగా చేసుకుని ప్రీమియం నిర్ణయించాలని, ఆయుష్మాన్ భారత్ అర్హతను NFSA డేటాతో అనుసంధానించాలని కోరారు. ప్రజా రవాణా సంస్థలకు టోల్ మినహాయింపు ఇవ్వాలని, తీర ప్రాంత కోతను ఎదుర్కొనేందుకు అదనపు నిధులు వినియోగించేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకార కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
తలస్సేరి–మైసూరు, నిలంబూర్–నంజన్‌గూడు రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కేంద్రం, కర్ణాటక సహకారాన్ని కోరారు. అటవీ మార్గాల్లో రాత్రి రాకపోకలపై పూర్తి నిషేధం విధించకుండా శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా కాన్వాయ్ పద్ధతిలో వాహనాలకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఆఫ్‌షోర్ మైనింగ్ వల్ల తీర ప్రాంత పర్యావరణంతో పాటు మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ అధ్యయనం, ఎస్ఓపీ లేకుండా మైనింగ్ బ్లాకుల వేలం నిర్వహించవద్దని కోరారు. మహిళలు, చిన్నారుల కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పథకాన్ని కొనసాగించాలని, డ్రగ్స్, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు దక్షిణాది రాష్ట్రాల మధ్య రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!