

జలప్రళయంతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాలయ దేశం నేపాల్‌ను ఆదుకునేందుకు పలు దేశాలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా కే-పాప్ స్టార్, ‘స్ట్రే కిడ్స్’ సభ్యుడు లీ నో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నేపాల్ వరద బాధితుల సహాయార్థం 100 మిలియన్ దక్షిణ కొరియా వన్‌లను (సుమారు రూ.69 లక్షలు) విరాళంగా అందించారు. వరల్డ్ విజన్ సంస్థ ద్వారా ఈ మొత్తాన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు వినియోగించనున్నారు. ఈ కష్ట సమయంలో నేపాల్‌కు తన వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం ఇచ్చినట్లు లీ నో తెలిపారు. నేపాల్ ప్రజలు వీలైనంత త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.
లీ నో 2014 నుంచి వరల్డ్ విజన్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు మద్దతు అందిస్తున్నారు. 2024లో ఆహార సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దేశాల కోసం 100 మిలియన్ వన్‌లను విరాళంగా ఇచ్చారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి కోసం కూడా భారీ విరాళం అందించారు. మరోవైపు భారత ఆధ్యాత్మికవేత్త, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ కూడా నేపాల్ వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. నేపాల్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ వరదల్లో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలిచిన లీ నో, జగ్గీ వాసుదేవ్ విరాళాలు మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!