

ఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, 2026పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) నేడు రెండోసారి సమావేశం కానుంది. కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు బిల్లులోని వివిధ నిబంధనలపై కమిటీ సభ్యులకు క్లాజ్ వారీగా వివరాలు ఇవ్వనున్నారు. విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణ, పారదర్శకత, పర్యవేక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. అనంతరం నిపుణులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను కూడా కమిటీ స్వీకరించనుంది.
ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు, గడువు ముగింపు లేదా రద్దు చేసుకున్న సంస్థలకు చెందిన విదేశీ విరాళాలు, వాటితో ఏర్పడిన ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, విక్రయానికి ‘డిజిగ్నేటెడ్ అథారిటీ’ ఏర్పాటు చేయడం బిల్లులోని ముఖ్య ప్రతిపాదనల్లో ఒకటి. ఇలాంటి ఆస్తులపై ప్రత్యేక అధికారాల ప్రతిపాదనకు విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, పర్యవేక్షణను బలోపేతం చేయడమే సవరణల ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!