

విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ‘ఇండియా – ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ’ అనే థీమ్‌తో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ వార్షిక సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఐఏటీఓ మాన్యువల్ బుక్’, ‘ది గోదావరి కాల్స్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీని దేశంలోనే కీలక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 2024–29 నూతన పర్యాటక విధానం ద్వారా పెట్టుబడులకు రాయితీలు అందిస్తున్నామని చెప్పారు.
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏడు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. పంచారామాలు, శక్తిపీఠాలు, వైష్ణవ క్షేత్రాలు, పుష్కర్ ఘాట్లు, పాపికొండలు, అంతర్వేది తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వెల్‌నెస్, ఎకో, అడ్వెంచర్, హెలీ, సీప్లేన్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ పర్యాటక శాఖను ప్రశంసిస్తూ, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కొత్త విమానాశ్రయాలు, మెరుగైన విమాన అనుసంధానం, సీప్లేన్ సేవలతో పర్యాటక ప్రయాణాలను మరింత సులభతరం చేస్తామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!