

భారత రక్షణ రంగానికి అవసరమైన అధునాతన సాంకేతికత, ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన రక్షణ సాంకేతిక స్టార్టప్ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పుణెలో జరిగిన కార్యక్రమంలో డ్రోగో ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ బొంతు యశ్వంత్, ఎంఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా డ్రోగో ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న ఆత్మాహుతి డ్రోన్లకు మరింత శక్తివంతమైన పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని అనుసంధానం చేసేందుకు ఎంఐఎల్ సాంకేతిక సహకారం అందించనుంది. ఆధునిక యుద్ధ రంగంలో నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కారణంగా ఇటువంటి డ్రోన్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. డ్రోగో ఏరోస్పేస్ ఇటీవల డెల్టా వింగ్ కామికేజ్ డ్రోన్‌ను అభివృద్ధి చేసి హైదరాబాద్ సమీపంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ నిర్దేశిత లక్ష్యాలపై సంచరిస్తూ సుమారు 20 నుంచి 30 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లేలా రూపొందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!