

గత మూడు సీజన్లుగా చెస్ అభిమానులను అలరిస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. శనివారం బెంగళూరులో ఈ లీగ్ ప్రారంభం కానుంది. గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్, పీబీజీ అలస్కన్ నైట్స్, అమెరికన్ గాంబిట్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, చెక్ ముంబా మాస్టర్స్, ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ జరగనుంది. తొలి రెండు సీజన్లు దుబాయ్, లండన్‌లో జరగగా.. గతేడాది ముంబై ఆతిథ్యమిచ్చింది.
ఈ సీజన్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గతేడాది లీగ్‌కు దూరమైన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఈసారి రీఎంట్రీ ఇస్తున్నాడు. మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ తొలిసారి గ్లోబల్ చెస్ లీగ్‌లో బరిలోకి దిగుతోంది. వరుసగా మూడు సీజన్లు గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విశ్వనాథన్ ఆనంద్ ఈసారి పీబీజీ అలస్కన్ నైట్స్ తరఫున ఆడనున్నాడు. కార్ల్‌సన్, దివ్యతో పాటు కోనేరు హంపి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌ను సవాల్ చేయనున్న నొదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ వంటి స్టార్లు ఈ లీగ్‌కు మరింత ఆకర్షణ తీసుకురానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!