

డిస్కాల్క్యులియా అనేది సంఖ్యలు, పరిమాణాలు, ప్రాథమిక గణిత భావనలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట అభ్యాస వైకల్యం. పిల్లల్లో అంకెలను గుర్తించడం, లెక్కించడం, పరిమాణాలను పోల్చడం, సాధారణ లెక్కలను గుర్తుంచుకోవడం, అనలాగ్ గడియారంలో సమయం చూడడం వంటి వాటిలో ఇబ్బందులు కనిపించవచ్చు. తోటి పిల్లలతో పోలిస్తే సాధారణ లెక్కలు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. పెద్దల్లో చిల్లర లెక్కలు, బిల్లులు చెల్లించడం, శాతాలు లెక్కించడం, పరిమాణాలను అంచనా వేయడం, బడ్జెట్ నిర్వహించడం, షెడ్యూల్ పాటించడం వంటి రోజువారీ పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. కుడి-ఎడమ గుర్తించడం, మ్యాప్‌లు చదవడం, కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు దారులు గుర్తుపెట్టుకోవడంలో కూడా గందరగోళం ఏర్పడవచ్చు.
డిస్కాల్క్యులియా, గణిత భయం రెండూ ఒకే సమస్యలు కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గణిత భయం ఉన్నప్పుడు లెక్కల విషయంలో ఒత్తిడి లేదా ఆందోళన పెరగవచ్చు. కానీ డిస్కాల్క్యులియా ఉన్నవారికి ఒత్తిడి లేని పరిస్థితుల్లో కూడా సంఖ్యలు, గణిత భావనలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు. ఈ సమస్యకు మెదడులో సంఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంలో ఉండే తేడాలు కారణమై ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. జన్యుపరమైన అంశాలు కూడా కొంత ప్రభావం చూపవచ్చు. ఇది బద్ధకం, తక్కువ తెలివితేటలు లేదా శ్రద్ధ లేకపోవడం వల్ల వచ్చేది కాదు. దీనిని నిర్ధారించేందుకు ఒకే ఒక్క పరీక్ష ఉండదు. గణిత నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఎదుగుదల, పాఠశాల పనితీరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తే సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. బొమ్మలు, సంఖ్యా రేఖలు, ప్రాక్టికల్ ఉదాహరణలు, అదనపు సమయం వంటి పద్ధతులు పిల్లలకు ఉపయోగపడతాయి. పెద్దలు కాలిక్యులేటర్లు, బడ్జెట్ సాధనాలు, క్యాలెండర్ రిమైండర్లను ఉపయోగించుకోవచ్చు.
గమనిక: అప్పుడప్పుడు లెక్కల్లో పొరపాట్లు జరగడం మాత్రమే డిస్కాల్క్యులియాకు సంకేతం కాదు. సమస్య నిరంతరం కనిపిస్తే అర్హత కలిగిన నిపుణుడి ద్వారా సరైన మూల్యాంకనం చేయించుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!