

హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వారాంతం కావడంతో శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గణేష్ దర్శనానికి వెళ్లే అన్ని మార్గాల్లో క్యూలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లతో పాటు అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఐమ్యాక్స్ మైదానం, హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ పార్కు వెనుకవైపు ఉన్న ఈ-రేసింగ్ మైదానం, నెక్లెస్ రోడ్డులోని మక్తా పార్కింగ్ స్థలం, విశ్వేశ్వరయ్య భవన్ తదితర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. భక్తులు సొంత వాహనాల్లో రావడం కంటే మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వారాంతాల్లో సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వీలైన వారు వారపు రోజుల్లో ఉదయం లేదా రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో దర్శనానికి రావాలని కోరారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం సెప్టెంబర్ 23 వరకు కొనసాగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!