

భారత అంతరిక్ష రంగంలో స్వదేశీ సాంకేతికతను మరింత బలోపేతం చేసే దిశగా ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపొందించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఈ నెల 30న రాత్రి 11.51 గంటలకు ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
నావిక్ వ్యవస్థ దేశంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ స్థాన నిర్ధారణ, నావిగేషన్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం అందుబాటులోకి వస్తే ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. స్వదేశీ నావిగేషన్ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా కీలక సేవల కోసం విదేశీ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, దేశ అంతరిక్ష సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంపై ఇస్రో దృష్టి సారిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!