

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 150తో నీట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణించే నిబంధన వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ జీవో కారణంగా వైద్య విద్యలో సుమారు 1,600 సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే నీట్ విధానం ద్వారా తెలంగాణ 15 శాతం సీట్లను కోల్పోతోందని, తెలంగాణ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉండాలని డిమాండ్ చేశారు.
జీవో 150ను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాకపోతే, కనీసం నిబంధనలను సవరించి తెలంగాణలో ఏడేళ్లు చదివిన వారినే స్థానికులుగా పరిగణించాలని కవిత సూచించారు. ఇది అత్యంత కీలకమైన అంశమని, ముఖ్యమంత్రి, అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమారు 1,500 మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలోనే మెడికల్ విద్యకు సంబంధించిన అవకాశాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!