

ప్రజల సమస్యలను పరిష్కరించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించడం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. సాంకేతికత నుంచి సాగునీటి వైపు చంద్రబాబు ప్రయాణిస్తున్నారంటూ ‘ది ప్రింట్’లో ప్రచురితమైన కథనాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు శేఖర్ గుప్తా ‘ఎక్స్’లో పంచుకున్నారు. చంద్రబాబు తన ‘సీఈవో సీఎం’ ఇమేజ్‌ను మార్చుకుని గ్రామీణ ప్రాంతాల్లో తెదేపా ఆదరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణ అందులో ఉంది.
ఈ కథనంపై చంద్రబాబు స్పందిస్తూ.. 1990ల్లో మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సాంకేతికత ఆధారిత వ్యవస్థను నిర్మించానని తెలిపారు. అప్పట్లో కొత్త ఉపాధి అవకాశాల సృష్టి తన ప్రధాన ప్రాధాన్యతగా ఉండేదన్నారు. ప్రస్తుతం తన దృష్టి.. దశాబ్దాలుగా అన్నదాతలు ఎదురుచూస్తున్న చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించే లక్ష్యాన్ని సాధించడంపైనే ఉందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, జీవనోపాధి మెరుగుదల, అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేర్చడమే తన మూలసిద్ధాంతమని పేర్కొన్నారు. తన సీఎంగా ప్రయాణాన్ని వివరించినందుకు ‘ది ప్రింట్’, శేఖర్ గుప్తాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!