

అమరావతి నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఆర్డీఏకు ₹2,100 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విడుదల చేసిన ₹2,100 కోట్లతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి ₹4,100 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ఖజానా నుంచి విడుదల చేసినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ పనుల కొనసాగింపునకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఇంతకుముందు అమరావతిని “సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ”గా ప్రభుత్వం ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ప్రజల డబ్బులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు విడుదల కావడంతో ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం సుమారు ₹47 వేల కోట్ల రుణాలు తీసుకువచ్చింది. ఆ రుణాలకు అదనంగా రాష్ట్ర ఖజానా నుంచి భారీగా నిధులు విడుదల చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పెంచుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అమరావతిని రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారుస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
అయితే అమరావతి అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమని ప్రభుత్వం అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. రాజధాని మౌలిక వసతులపై పెట్టుబడులు భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొంటున్నాయి. తాజా నిధుల విడుదలతో అమరావతి ఆర్థిక నమూనాపై రాజకీయ చర్చ మళ్లీ వేడెక్కింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!