

నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మహేశ్‌కుమార్ గౌడ్.. ఎన్నికల సంఘం తీరు దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహారశైలిపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వల్ల బిహార్‌లో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమి చెందాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తీరుపై అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మీనాక్షి నటరాజన్ సీటును చోరీ చేశారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!