

హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, ఇంటింటికీ ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఐలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ వంటి అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా గ్రీన్ వాటర్ ట్యాంకర్లపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చన్నారు. తొలివిడతలో 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లో ఈ సేవలను విస్తరించాలని తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన తదితరులు పాల్గొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!