

ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పరిస్థితులను తెలుసుకున్నారు. గత 24 గంటల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వివరించారు. కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్లు, కోనసీమ జిల్లాలో మరో 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి-16పై చెట్లను తొలగించినట్లు, మిగిలిన ప్రాంతాల్లోనూ తొలగింపు పనులను వేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. కోనసీమ, పశ్చిమ గోదావరి మినహా ఇతర తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలిపారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏపీసీపీడీసీఎల్ సిబ్బందిని కూడా వినియోగించాలని, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనులను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కూలిన చెట్లను తొలగించి సాయంత్రానికల్లా రహదారులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంపద, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలు, రహదారులు, చెరువులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని, రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను సమీక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత రాత్రి నుంచి నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించినట్లు పేర్కొన్న సీఎం, ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!