

క్యాన్సర్ బాధితులపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. షెడ్యూల్డ్ జాబితాలో లేని క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) సవరించిన ధరలతో 543 బ్రాండ్ల క్యాన్సర్ ఔషధాల జాబితాను విడుదల చేసింది. ఈ కొత్త ధరలు నవంబర్ 9, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 27 నాటికి ఔషధ తయారీ సంస్థలు అందించిన వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఎన్‌పీపీఏ వెల్లడించింది.
సవరించిన ధరల ప్రకారం కొన్ని క్యాన్సర్ ఔషధాల ధరలు గణనీయంగా తగ్గాయి. BEVACIZAB బ్రాండ్ ఇంజెక్షన్ ధర గతంలో రూ.21,767.70 ఉండగా, ప్రస్తుతం రూ.5,930.13కు తగ్గింది. అలాగే Debrumab 60 mg ఇంజెక్షన్ ధర రూ.22,031.25 నుంచి రూ.5,941కు దిగివచ్చింది. ఈ నెల 17న 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల ట్రేడ్ మార్జిన్ల హేతుబద్ధీకరణను ఎన్‌పీపీఏ ప్రకటించింది. సవరించిన ధరల వివరాలను సమర్పించాలని తయారీదారులను ఆదేశించింది. సంస్థల నుంచి కొత్త ధరల సమాచారం అందినప్పుడల్లా జాబితాను నవీకరిస్తామని అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!