

ఈ20 పెట్రోల్ అంశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులను వెంటనే తొలగించాలని బాంబే హైకోర్టు మెటా, గూగుల్‌తో పాటు పలు సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. మంత్రి, ఆయన కుటుంబాన్ని ఇంధన విధానంతో ముడిపెడుతూ ప్రచారం చేస్తున్న ఏఐ ఆధారిత కంటెంట్ అత్యంత అభ్యంతరకరమని కోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తుల పరువుకు భంగం కలిగించే ఇలాంటి పోస్టులకు సోషల్ మీడియా వేదికల్లో చోటు ఉండకూడదని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా బాధితులు కోర్టును ఆశ్రయించకుండానే ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను తొలగించే వ్యవస్థ ఎందుకు లేదని సోషల్ మీడియా సంస్థలను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ20 పెట్రోల్ విధానం వల్ల తన కుటుంబం లబ్ధి పొందిందంటూ డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ నితిన్ గడ్కరీ హైకోర్టును ఆశ్రయించారు. పరువునష్టం కలిగించినందుకు రూ.11 కోట్ల నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!