

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన ఆమె.. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలక స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశారు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక సామరస్యం, అన్ని వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలంటే బతుకమ్మ మరోసారి ఉద్యమ స్వరూపం దాల్చాలని అన్నారు. బహుజన తెలంగాణ నిర్మాణానికి పేదింటి బిడ్డలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, విశ్వవిద్యాలయాలు నాయకులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను సాధించే వరకు పోరాడతామని కవిత స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కొరత, అధ్యాపకుల ఖాళీలపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శిస్తూ, గతంలో బీఆర్ఎస్‌లో భాగస్వామిగా ఉన్నందుకు మరోసారి క్షమాపణలు తెలిపారు. రోహిత్ వేముల చట్టం, ఉద్యోగ క్యాలెండర్ వంటి హామీలపై కాంగ్రెస్‌ను ప్రశ్నించాలని విద్యార్థులకు సూచించారు. ఎన్నికల కమిషనర్‌ను మార్చడం మాత్రమే సరిపోదని, ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు తిరిగి నిర్వహించాలని, యువత అనుచరులుగా కాకుండా నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!